మన టీవీ సిక్స్ న్యూస్ ( భక్తి వార్తలు మనకోసం-02/02/2025 ఆదివారం). మాఘశుద్ధ పంచమిని సరస్వతీ జయంతిగా ఆరాధించడం అనేది మనకి పురాణాలలోను, ఇతర శాస్త్రాలలోను కనబడుతున్నటువంటి అంశం.
ఈ మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అని వ్యవహారం ఉన్నది.నిజానికి వసంత ఋతువు చైత్రమాసంలో వస్తుంది, కానీ శాస్త్రరీత్యా దీనికి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది. ఈరోజున సరస్వతీ దేవి ఆవిర్భావదినంగా దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం ప్రస్తావిస్తున్న అంశములు. పరమ పురుషుని యొక్క వదనం నుంచి సరస్వతీ దేవి ఆవిర్భవించింది అని కథ, ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైనటువంటి పరమేశ్వరుడు, విరాట్ పురుషుడు; ఆయన యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఈ మూడింటి యొక్క స్వరూపమే సరస్వతి.
మనం కూడా ఏదైనా పని చేయాలంటే మననుంచి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి. అందులో జ్ఞానశక్తితో ఏదైనా ఒక విషయాన్ని జ్ఞానశక్తితో, క్రియాశక్తితో, ఇచ్ఛాశక్తితో చేయగలం. ఒక పని చేయడానికి మనయొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో ఈ విశాలమైన విశ్వమనేటటువంటి దీని యొక్క సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరుడికి కూడా ఒక జ్ఞానము, ఒక వాక్కు, ఒక బుద్ధి ఉంది. ఆయన యొక్క బుద్ధి, జ్ఞానము ఏదైతే ఉందో ఆ శక్తిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం.
ఆ సరస్వతి ఈనాడు విరాట్ పురుషుని నుంచి ఆవిర్భవించింది అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం, అందుకే ఈరోజున సరస్వతీ దేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. కేవలం భూలోక మానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈరోజు సరస్వతీ దేవిని ఆరాధిస్తారు అని దేవీభాగవతం చెప్తున్నది. అందుకు ఈరోజున విద్యార్థులు, పెద్దవారు అందరూ కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలి అని శాస్త్రం చెప్తున్న విషయం.
