మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం). శతాబ్ద కాలపు చరిత.. రాబోయే వందేళ్ల పాటు సేవలు అందించబోయే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన నిర్మాణ మహోజ్వల ఘట్టానికి 31వ తేదీ శుక్రవారం అడుగుపడింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
🔸 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డితో కలిసి గోషామహల్ స్టేడియం ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల కొత్త భవనాల నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు.
🔸 పండుగ వాతావరణం లో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్జల్‌గంజ్‌లోని ప్రస్తుత ఆసుపత్రిని మరింత ఆధునిక సౌకర్యాలతో వచ్చే వందేళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలతో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరగడం పట్ల వైద్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
🔸 మొత్తంగా 26 ఎకరాల ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు భవన నిర్మాణాలు చేపట్టనుండగా, ఈ ఆసుపత్రిలో 2 వేల పడకలతో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్స్ వంటి సర్వ హంగులను సమకూర్చనున్నారు.
🔸 ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులతో కలిసి ఆసుపత్రి నమూనాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.
🔸 ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
