పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. 2022లో వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని, 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తసుకెళ్లారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని.. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలపాలని, అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తిశాఖకు లేఖలు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.