google-site-verification: google78487d974c7b676c.html
Daily News

Cm revanth reddy: ఉదారంగా పరిహారం

66KViews

రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

  • భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి
  • ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి
  • దక్షిణ భాగానికి హెచ్‌ఎండీఏతో ఎలైన్‌మెంట్‌
  • ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌
  • అటవీ అనుమతుల కోసం మంత్రులు దిల్లీకి వెళ్లాలని నిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ సూచనప్రాయంగా ఆమోదం తెలిపినందున… హెచ్‌ఎండీఏతో కలిసి ఎలైన్‌మెంట్‌ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. భూసేకరణలో భూములు కోల్పోయే రైతులకు ఉదారంగా పరిహారం ఇవ్వాలని, వీలైనంత ఎక్కువ పరిహారం వారికి అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారుల భూసేకరణ, పరిహారం, హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) విధానంలో రహదారులు, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలపై శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తెలంగాణ రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో మంచిర్యాల- పెద్దపల్లి-జయశంకర్‌ భూపాలపల్లి-వరంగల్‌-హనుమకొండ-మహబూబాబాద్, ఖమ్మం మీదుగా నాగ్‌పుర్‌-విజయవాడ, ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారుల నిర్మాణం; వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటు, అటవీ అనుమతుల్లో అడ్డంకులపై సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు.

అటవీశాఖ ఎందుకు కొర్రీలు పెడుతోంది?

ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీశాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ను సీఎ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రస్థాయిలో పరిష్కారమయ్యేవి ఇక్కడే పరిష్కరించాలని, కేంద్ర పరిధిలోని సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ‘‘భూసేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించండి. రైతులతో సమావేశమై రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలు వివరించాలి. తద్వారా భూసేకరణ వేగవంతం చేయండి. రేడియల్‌ రోడ్లకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఆ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి అనుకూలం కూడా. కాబట్టి అవుటర్‌ రింగు రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్‌ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. భూసేకరణపై అటవీ శాఖ పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించండి. ఇందుకోసం అటవీ, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలి. సమస్యల పరిష్కారం కోసం రెండు శాఖలు ప్రత్యేక అధికారులను నియమించాలి. కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం అవసరమైతే ఈ రెండుశాఖల మంత్రులు దిల్లీకి వెళ్లి వాటిని సాధించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదిరోజులకోసారి అనుమతులపై సమీక్షించాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్‌పాస్‌ల ఏర్పాటును విస్మరించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు ఎంతో దూరం వెళ్లి తిరిగిరావాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు ఒకే నాణ్యతతో…

‘‘రాష్ట్రంలో హ్యామ్‌ విధానంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 12 వేలు, పంచాయతీరాజ్‌ పరిధిలో 17,700 కిలో మీటర్ల రహదారులు నిర్మించాలి. ఈ నిర్మాణాలన్నీ మూడేళ్లలో పూర్తికావాలి. రోడ్ల నిర్మాణానికి సంబంధించి పూర్వ జిల్లాలను యూనిట్‌గా తీసుకోండి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అనే తేడాలు లేకుండా ఒకేరకమైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలి. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్‌ తయారీ, రహదారుల నిర్మాణ విషయంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయండి. కూలిన వంతెనలు వెంటనే నిర్మించాలి. రహదారుల నిర్మాణానికి రాష్ట్ర వాటా వెంటనే విడుదల చేసి, కేంద్ర వాటా నిధులు రాబట్టేందుకు ఆర్థిక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!