ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు.
అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేశ్ మాట్లాడారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని.. మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలల్లోనూ అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలల్లో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు.