Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. నేడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకే రోజు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేయడం ఒదే తొలిసారి. నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకోవడం, విద్యా శాఖలో చేపట్టాల్సిన విప్లవాత్మక మార్పులకు వారి నుంచే సలహాలు, సూచనలను స్వీకరించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులందరూ.. తమకు కేటాయించిన జిల్లాల్లో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాల్లో పాల్గొంటోన్నారు. స్థానికంగా పాఠశాలల అభిృద్ధి, విద్యార్థులకు మరింత మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్యను అందించడానికి సలహాలు, సూచనలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా- పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులందరి పేర్లను అడిగి తెలుసుకున్నారు. పేరుపేరున ఆప్యాయంగా పలకరించారు. షేక్ హ్యాండ్ ఇస్తూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తన చిత్రాన్ని గీసిన ఓ విద్యార్థిని ఆయన అభినందించారు. ఆ చిత్రపటంపై ఆటోగ్రాఫ్ చేశారు. అప్పటికప్పుడు తన బొమ్మను వేసిన ఆ విద్యార్థినికి దాన్ని బహూకరించారు. అనంతరం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.