మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వెంటనే చేపట్టాలని, గ్రౌండింగ్ అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. సత్తుపల్లి మండలం కొత్తూరు, పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామాల్లో పర్యటించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ? ఇసుక ఉచితంగా ఇస్తున్నారా ?, అధికారుల సహకారం ఎలా ఉంది ? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వంద శాతం చేయాలన్నారు. ముగ్గు పోసి, రికార్డు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సత్తుపల్లి మండలానికి 576 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 467 ఇండ్లు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పెనుబల్లి మండలంలో 612 మంజూరు కాగా 541 ఇండ్లు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి.
ప్రతి మండలానికి ఎంత మేర ఇసుక, మట్టి అవసరమో, ముందుగానే డంప్ చేసుకోవాలని, ఎఇల ద్వారా సంబంధిత తహసీల్దార్ కూపన్లు లబ్ధిదారులకు జారీచేస్తారని తెలియజేశారు. ప్రతి సోమవారం నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులకు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కొత్తూరు గ్రామంలోని రేకుల కాలనీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని, ఇందిరమ్మ ఇండ్ల కాలనిగా రూపుదిద్దుకోవాలని కలెక్టర్ లబ్ధిదారులను కోరారు. ఇల్లు పూర్తి చేసుకుని త్వరితగతిన గృహ ప్రవేశానికి పిలవాలని లబ్దిదారులని కోరారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, ఎంపిడిఒలు, నాగేశ్వరరావు, అన్నపూర్ణ, తహశీల్దార్లు సత్యనారాయణ, నారాయణ మూర్తి, హౌజింగ్ ఏఇ లు పవన్ కళ్యాణ్, కమల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
