మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/04/2025 బుధవారం). వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, గత రెండేళ్ళుగా ఇ కుబేర్ లో పెండింగులో ఉన్న బిల్లులన్నీంటినీ వెంటనే విడుదల చేయాలని, 01.07.2023 నుండి అమలు చేయాల్సిన రెండవ పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు.
బుధవారం మధ్యాహ్నం వి ఎం బంజర్ హైస్కూలులో జరిగిన టిఎస్ యుటిఎఫ్ కార్యకర్తల సమావేశంలో చావ రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సెలవులెక్కువంటూ ముఖ్యమంత్రి మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర ఉద్యోగులకు సంవత్సరానికి ముప్పై రోజులు సంపాదిత సెలవు ఇస్తారని, ఉపాధ్యాయులను వెకేషన్ డిపార్ట్మెంట్ గా ప్రకటించినందున సంవత్సరానికి ఆరురోజులు మాత్రమే సెలవులు ఇస్తారని, ఈ వాస్తవాన్ని తెలుసుసుకోకుండా చట్టసభల్లో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడం అవుతుందని అన్నారు. పెండింగ్ డిఎలు, పిఆర్సీ అడిగితే మొదటి తేదీన జీతాలు ఇవ్వలేమనడం పరోక్షంగా బెదిరించడమేనన్నారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే శరణ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిపిఎస్, యుపిఎస్ లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20 న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్, ప్రధాన కార్యదర్శి పి నాగేశ్వరరావు, ఎఫ్ డబ్లయు ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జివి నాగమల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వి వి రామారావు, మండల నాయకులు జి. వీరస్వామి, కొప్పుల శ్రీనివాస రావు, ఎన్.హెచ్.ప్రసాద్, వి. తిరుపతి రావు, కే నాగేశ్వరరావు, టి మురళీకృష్ణ, బి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
