మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 04/05/2025 ఆదివారం). ప్రశ్నించే వారిని భయపెట్టడం, చంపటమే మోడీ సర్కార్ లక్ష్యమా ? అని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని జాతీయ రహదారిపై శనివారం సిపిఎం – ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ ఆపాలని నిరసన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు మాట్లాడుతూ, దోపిడీ వర్గాలకు మావోయిస్టులు వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వం వారిపై అణచివేత చర్యలకు పూనుకుంటుందని, ఆదివాసీ ప్రాంతాల్లో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి, సుమారు 25 వేల మిలటరీ దళాలను దించి, ఆదివాసీల భయపెడుతూ, వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కాగార్ తక్షణమే నిలుపుదల చేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విఠల్ రావు అన్నారు.
ఈసందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మావోయిస్టుల పోరాటాన్ని సామాజిక కోణంలో చూడాలని, ప్రజాస్వామ్య దేశంలో ఇంత నిరంకుశంగా చర్యలు చేపట్టడం సరైన పద్ధతి కాదని, గిరిజనుల ప్రాణాలు హరిస్తున్న ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలుపుదల చేయాలని, ఆయన డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గాయం. తిరపతి రావు మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని, ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో 25వేల మంది భద్రతా బలగాలను పంపించడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు, అడవుల్లో ఉన్న ఆదివాసి మహిళలపై లైంగిక దాడులు, పురుషులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిమట. విశ్వనాథం, సిపిఎం నాయకులు గుడిమెట్ల బాబు, పోతిని బుచ్చయ్య, చిలక రమణ, పోతేనీ కొరయ్య, సరస్వతి, పద్మ, హనుమంతరావు తదితరులు నాయకత్వం వహించారు.