google-site-verification: google78487d974c7b676c.html
Daily News

భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది… సిఎం రేవంత్ రెడ్డి.

177Views

మన టివి6 న్యూస్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 08/05/2025 గురువారం) “భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉగ్రవాదులను హెచ్చరించారు. “భారతీయ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌ను ఎవరూ ఆపలేరు. భారతదేశ రక్షణ కోసం మేమంతా ఒక్కటే. వీర జవానులు ఏ చర్య తీసుకున్నా అందుకు మద్దతుగా వారి వెంట నడవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని చెప్పారు.

✅ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి గారు ముందుండి ర్యాలీ నిర్వహించారు.

✅ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి చిత్రపటాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ, వీర జవానులకు దేశం అండగా నిలబడుతుందని ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్‌కు గట్టిగా హెచ్చరించారు.

✅ భారత వీర జవానులకు దేశ ప్రజలందరూ అండగా ఉన్నామని, భారత దేశ సార్వభౌమాధికారం మీద ఎవరు దాడి చేసినా వారిని వదలిపెట్టబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ గడ్డమీద నుంచి ఇవ్వడానికే ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు.

✅ “భారత వీర జవాన్లకు అండగా నిలబడి, వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల ప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులంతా వేలాదిగా ఈ సంఘీభావ ర్యాలీకి తరలివచ్చి మన సైనికులకు అండగా నిలిచినందుకు అందరికీ అభినందనలు.

✅ పాకిస్తాన్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ర్యాలీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మా వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే. ఈ భూమి మీద నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే.

✅ శాంతి ద్వారానే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాం. పాకిస్తాన్‌కు సైతం స్వతంత్రం వచ్చిందంటే అమరుడైన మహాత్మాగాంధీ శాంతియుత పోరాటం వల్లే. అమరుడైన మహాత్మాగాంధీ శాంతి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న 140 కోట్ల భారతీయులు ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ అభివృద్ధి పథం వైపు దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నారు. భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని కోరుకుంటున్నారు.

✅ మా శాంతిని, మా శాంతి ఆకాంక్షను, చేతగాని తనంగా ఎవరైనా భావిస్తే, మా భూ భాగంలో కాలుమోపి మాఆడబిడ్డల నుదిటి సిందూరాన్ని తుడిచివేయాలని అనుకుంటే వారిని నేలమట్టం చేసే శక్తి మా వీర సైనికులకు ఉంది. వారికి 140 కోట్ల భారతీయులు అండంగా నిలబడుతారు. జై హింద్” అంటూ ముగించారు.

✅ ఈ ర్యాలీలో మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రతినిధులు, మాజీ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!